ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

25-Jan-2017

గ్రామాల్లో కీలకం పంచాయతీ కార్యదర్శి

 

Posted by:  ఈనాడు - ప్రతిభ


ఏపీపీఎస్సీ 1055 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాల్లో ఎంతో కీలకమైన ఈ పోస్టు కోసం గ్రామీణ యువత ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తోంది. సొంత గ్రామాలకు దగ్గరగా ఉద్యోగం చేసుకోవచ్చు. సామాజిక హోదాతో పాటు మంచి జీతం కూడా ఉంటుంది. దీని కోసం రాత పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. స్ర్కీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ప్రధాన పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్, ఆధునిక భారత దేశ చరిత్ర, భారత దేశ ఆర్థికాభివృద్ధి, జనరల్ సైన్స్ వంటి అంశాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతర సమస్యలు, రెండో పేపర్ లో గ్రామీణాభివృద్ధికి చెందిన అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

 

అయిదు వేల జనాభా లేదా అయిదు కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రామాలను ఒక క్లస్టర్ గా చేసి ఒక కార్యదర్శిని నియమించాలని 2010లో ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కార్యదర్శి విధుల పరిధిలో దాదాపు నాలుగైదు గ్రామాలు ఉంటాయి. గ్రామాల ప్రాథమిక అవసరాలైన పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీరు తదితర ఏర్పాటు చేయడంతోపాటు పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపిక, జనన-మరణాలకు, వివాహాలకు ధ్రువీకరణ పత్రాల జారీ వంటి కీలక బాధ్యతలను పంచాయతీ కార్యదర్శి నిర్వహిస్తారు. వీటితోపాటు పంచాయతీ నిధుల వినియోగం, నగదు పుస్తకం నిర్వహణ, ఏటా ఆడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తారు. పంచాయతీ తీర్మానాల ఆధారంగా కార్యదర్శి తన విధులు నిర్వర్తిస్తారు. దాదాపు 64 పైగా బాధ్యతలు, 72 రికార్డుల నమోదు ఉంటుంది. దేశానికి అవసరమైన ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని కార్యదర్శులు నమోదు చేస్తారు.

పరీక్షలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఏ అంశాన్ని విస్మరించకుండా ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేయాలి. వీలైనన్ని ఎక్కువ మోడల్ ప్రశ్రలు, మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. అధ్యయనం, పునశ్చరణ, స్వీయ పరీక్ష... ఇలా విభజించుకొని ప్రిపరేషన్ సాగిస్తే మీ కలల పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు.

క్లిక్ చేయండి
Tags:Panchayath Secretary,ADD A COMMENT


 

  

 

copyright © Ushodaya Enterprises Private Limited 2016